మయసభలో ఓ మగువ!

"ద్రౌపది చీర లాగినపుడు కృష్ణుడు వచ్చి కాపాడాడు.కాపాడినపుడు కొంతమందే సంతోషించారు.వివస్త్రగా ఉన్న ద్రౌపదిని చూడలేకపోయామని చాలామంది బాధపడ్డారు. భాదపడినవాళ్ళు అందరూ కురుక్షేత్రంలో చచ్చారు.మయసభలో ద్రౌపది మీద శారీరకంగా కాకపోయినా,మానసికంగా అత్యాచారం జరిగింది.కాపాడే కృష్ణులు కొంతమందే,కావాలనుకునే కీచకులు కోకొల్లలు". ప్రతిసారి కృష్ణుడు రాడు. నేను ద్రౌపదినీ కాను.

అలా కటకటాల వెనుక ఒక చోట కూర్చొని పుస్తకంలో రాస్తూ ఉన్న ఆమె మోములో విచారం మరియు ఆనందం . సముద్రపు అంచున వీక్షించే సూర్యోదయం ఆమె కనుల్లో కనిపిస్తుంది. కళ్ళలో నీళ్లు ఒక వైపు , ఆమె చూపులో వెలుగు కలిపి ఒక హరివిల్లు. గర్వంతో అలకరించబడ్డ అధరం. ఆర్తితో ఎండిపోయిన గరళం. అంతలో పక్కనే ఉన్న కుండలో నీళ్లు తీసుకుని తాగింది. నేలపైన దుప్పటి కప్పుకొని నిద్రపోబోతున్న ఆమెను ఒక ఆలోచన నిద్రపోనివ్వలేదు.

ఎన్నో ఆశలతో ఆమె, గుండె నిండా బాధతో వాళ్ళ అమ్మ నాన్న సొంత ఊరు నుండి పట్నం వచ్చారు.చెప్పులు కూడా లేకుండా పొలం లో పనులు చేసే వాళ్ళ నాన్న, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగే వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో ఆశయాలతో పట్నం వచ్చిన ఆమె, ఉద్యోగ వేటలో ఒంటరిగా పయనించింది. ఆమెకేం తెల్సు మార్గంలో మృగాలు అడ్డుపడతాయని. ఒక రోజు రాత్రి తన దిశ లో ఎదురయ్యిందా మృగం. తన అరుపులు సూన్యంలోని ఉరుములు. ఆమె జీవితాన్ని ఛిద్రం చేసే హక్కు ఆ మృగానికి ఎవరిచ్చారు?. నిండుగానే ఉందిగా ఆమె వస్త్రాలంకరణ. అర్దనగ్నం అనువంత కూడా లేదుగా. కోరిక తీర్చుకోవాలనే కాంక్ష తప్ప వేరే ఉద్దేశంలేదా మృగానికి!.

భారతం వినడానికి బాగానే ఉంటుంది, ఆచరించాలి అంటే ఆయుధం పట్టాలి అనే మాటలు ఆమె ఆలోచనకు వచ్చాయి. కోరిక తీర్చుకోటం కోసం వచ్చిన ఆ మృగాన్ని వేటాడడానికి ఆత్మాభిమానం ఆమె ఆయుధం అయ్యింది, చిన్న ఇనుపరేకు చేయూత నిచ్చింది. తన చున్నీ పట్టుకొని లాగినంతలో ఆ ప్రదేశమంతా మనుషుల్లేని మయసభలా అనిపించింది. మీదికి దూకబోయిన మృగాన్ని మట్టుబెట్టింది. చట్టంలోని చిట్టాల దృష్ట్యా మృగాన్ని చంపడం కూడా నేరమే కాబట్టి ఆమె విచారణ కోసం చెరసాలకి చేరింది.

ప్రతిసారి కృష్ణుడు రాడు. ఆమె ద్రౌపది కాదు.

ఈ కథ ఒక ఊహజనితం.ఆడవాళ్లు అంత ధైర్యంగా ఉండాలి అని చెప్పటమే ఇక్కడి ఉద్దేశ్యం.కానీ స్త్రీల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.చట్టసభల్లో ఎన్ని చట్టాలు రూపొందించినా ఈ దారుణాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి నిమిషం ఎదో ఒక చోట ఎదో ఒక విధంగా స్త్రీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.కఠిన శిక్షలు అమలు అవుతున్నా, సమాజం సిగ్గుపడేలా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల వ్యక్తిత్వాలు మారాలి.

ఈ సమాజం ఒక మయసభలా కాకుండా స్త్రీలని గౌరవించే విధంగా మారాలి , మార్చడానికి మనం కట్టుబడి ఉండాలి.భవిష్యత్తులో అఘాయిత్యాలు జరగకుండా ఉండాలని ఆశిద్దాం!.

Comments

Popular Posts

ఆమె చెప్పిన రహస్యం!!

చైనా వస్తువుల పై నిషేధం సాధ్యమా !?

ఆమె వంట తింటే ఇక అంతే! ఆమె ఎవరు?